‘వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది... అందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఉమ్మడి మెదక్ జిల్లా అటవీశాఖ సీసీఎఫ్(ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు) శరవణన్ అన్నారు. బుధవారం రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో పద్మజారాణితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవిలోకి వచ్చే వారి వద్ద అగ్నికి సంబంధించిన వస్తువులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వన్య ప్రాణుల దాహర్తిని తీర్చడానికి క్రమం తప్పకుండా సాసర్ ఫీట్లలో నీరు పోయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
సుమారు మూడు కిలో మీటర్ల వరకు అటవీ ప్రాంతంలో మొక్కలు, నీటి కుంటలు, గార్డెన్‌లా తలపించే ప్రాంతాలను చూసి హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే మరింతగా అభివృద్ధి చేస్తే అక్కన్నపేట ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. అటవీ ప్రాంతం మొత్తం ఎంతో పరిశుభ్రంగా ఉందని సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. ఆయన వెంట స్థానిక రేంజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ రేంజర్ ఖుత్బొద్దీన్, బీట్ ఆఫీసర్ రాములు, బేస్ క్యాంపు వాచర్‌లు జంగం యాదగిరి, ఆంజనేయులు, శంకర్, నారాయణ, శ్యాం తదితరులు ఉన్నారు.