అమెరికాను వేడుకొంటున్న హెచ్ 1బి వీసాదారులు

అమెరికాలో ఉన్న హెచ్‌ 1బీ వీసాదారులకు ఇప్పుడు ఎక్కడలేని కష్టం వచ్చిపడింది. కోవిడ్‌-19 కారణంగా పెద్ద పెద్ద టెక్‌ కంపెనీల వ్యాపారాలన్నీ దెబ్బతినటంతో విదేశీ టెక్‌ నిపుణులను వదిలించుకొనే పనిలో పడ్డాయి. దాంతో ఇండియా, చైనా దేశాల నుంచి హెచ్‌ 1బి వీసాలతో అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్న వేలమంది టెక్‌ నిపుణులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.


అమెరికాలో లభించని టెక్‌ నిపుణులను ఆ దేశ కంపెనీలు విదేశాల నుంచి రప్పించి పనిచేయించుకొనేందుకు అమెరికా ఇచ్చే తాత్కాలి వీసానే హెచ్‌ 1బి. ఈ వీసాపై అమెరికాలోని ఏదేని కంపెనీలో ఉద్యోగంలో చేరిన నిపుణుడు అక్కడ కాంట్రాక్టు అయిపోయిన 60 రోజుల్లోగా కుటుంబంతోసహా అమెరికాను విడిచి వెళ్లాలని ఇటీవల ట్రంప్‌ సర్కారు నిబంధన విధించింది. ఊహించని విధంగా కరోనా సంక్షోభం తలెత్తటంతో ప్రపంచవ్యప్తాంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌ అయ్యాయి. దాంతో విదేశీ నిపుణులకు ఎక్కువగా నియమించుకొనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముందుముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. దాంతో హెచ్‌ 1బి వీసాదారులపై కత్తి వేలాడుతున్నదని విశ్లేషకులు చెపుతున్నారు.


మరోవైపు మార్చి 21నాటికే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల సంఖ్య ౩.౩ మిలియన్లకు చేరుకుంది. కరోనా వ్యాధి ఇప్పటికీ అమెరికాలో విలయతాండవం చేస్తూనే ఉంది. దాంతో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోవటం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ ప్రభుత్వంగనుక తమ దేశ పౌరులకే మొదటి ప్రాధాన్యం అనే నిర్ణయం తీసుకొంటే హెచ్‌ 1బి వీసాదారులపై పిడుగు పడ్డట్టే. ఉద్యోగాలు పోయిన వెంటనే కుటుంబాలతోసహా అమెరికాను విడిచిపెట్టాలి. ఇక్కడే మరో సమస్య ఎదురవుతున్నది.