ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్‌లో ఉన్న వారిలో 24 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. మర్కజ్ భవనం నుంచి 1,034 మందిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. వీరిలో 334 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా, మరో 700 మందిని క్వారంటైన్‌కు తరలించామని మంత్రి పేర్కొన్నారు. ఆస్పత్రికి తరలించిన వారిలో ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరందరిని ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 34 ట్రిప్పుల్లో వీరిని తరలించారు.
ఈ నెల 1వ తేదీ నుంచి 15వరకు జరిగిన మత ప్రార్థనల్లో 1500 నుంచి 1700 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్నారు. మత ప్రార్థనలు నిర్వహించిన వారు దారుణమైన నేరానికి పాల్పడ్డారు అని సత్యేంద్ర జైన్ చెప్పారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని చెప్పినప్పటికీ ప్రజలు వినిపించుకోవడం లేదన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశామని సత్యేంద్ర జైన్ తెలిపారు. సామూహికంగా మత ప్రార్థనలు నిర్వహించిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు.